Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి

28 Sep, 2021 04:38 IST|Sakshi

అయినా తాజా గరిష్టాల వద్ద ముగింపు  

ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌  

అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌  

సెన్సెక్స్‌ లాభం 29 పాయింట్లు  

రెండు పాయింట్లే పెరిగిన నిఫ్టీ 

ఆటో, బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు 

ఐటీ, ఫార్మా, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 525 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 29 పాయింట్ల లాభంతో 60,078 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 141 పాయింట్ల శ్రేణిలో ట్రేడింది. మార్కెట్‌ ముగిసే సరికి రెండు పాయింట్ల అతి స్వల్ప లాభంతో 17,855 వద్ద నిలిచింది. ఈ ముగింపులు ఇరు సూచీలకు జీవితకాల గరిష్ట స్థాయిలు. ఎవర్‌గ్రాండే సంక్షోభంతో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల అంశాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.

తొలిసెషన్‌లో ఆటో, బ్యాంకింగ్, ఆయిల్‌అండ్‌గ్యాస్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మిడ్‌సెషన్‌ నుంచి ఐటీ, ఫార్మా, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. రియల్‌ ఎస్టేట్‌  దిగ్గజం ఎవర్‌గ్రాండే సంక్షోభాన్ని తట్టుకొనేందుకు చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆ దేశ వ్యవస్థలోకి 17 బిలియన్‌ డాలర్లను చొప్పించడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జర్మనీ ఎన్నికల్లో నేపథ్యంలో యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరగడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 73.83 వద్ద స్థిరపడింది. ‘‘ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబం చేసే పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాల విడుదల కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రియల్టీ సెక్టార్లో డిమాండ్‌ తిరిగి  ఊపందుకోవడంతో ఈ రంగ షేర్ల ర్యాలీ కొనసాగింది. షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ కదలాడుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించాలి’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

టాప్‌గేర్‌లో ఆటో షేర్ల ర్యాలీ...  
ఆటో షేర్లు టాప్‌గేర్‌లో దూసుకెళ్లాయి. పండుగ సీజన్‌ ప్రారంభంతో ఈ సెప్టెంబర్‌ వాహన విక్రయాల్లో వృద్ధి ఉండొచ్చని, అక్టోబర్‌లోనూ డిమాండ్‌ కొనసాగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. సెమికండెక్టర్ల కొరత కొంతమేర తగ్గిందని పలు కంపెనీల వ్యాఖ్యలు ర్యాలీకి తోడ్పాటును అందించింది. మారుతీ సుజుకీ షేరు అత్యధికంగా ఆరున్నర శాతం ఎగసింది. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, భారత్‌ ఫోర్జ్, అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు 5–4% చొప్పున రాణించాయి. టీవీఎస్, భాష్, ఎంఆర్‌ఎఫ్, హీరోమోటోకార్ప్, బజాజ్‌ ఆటో, అశోక్‌ లేలాండ్‌ షేర్లు రెండు నుంచి మూడు శాతం పెరిగాయి. 

రిలయన్స్‌ మెరుపులు...  
రిలయన్స్‌ షేరు ట్రేడింగ్‌లో మెరిసింది. ఇంట్రాడేలో 2% పైగా ర్యాలీ చేసి రూ.2529 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. షేరు ధర ఆల్‌టైమ్‌ హైని అందుకోవడంతో బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ విలువ  రూ.16 లక్షల కోట్ల పైకి ఎగసింది. మార్కెట్‌ విలువ విషయంలో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ ఇదే. చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు 2% లాభం తో రూ.2525 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో మా ర్కెట్‌ విలువ కూడా దాదాపు  రూ. 16 లక్షల కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్‌ షేరు ఈ ఏడాది(2021)లో 27% ర్యాలీ చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు