చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!

25 Apr, 2022 06:08 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్‌ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్‌ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్‌ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది.

అంత క్రితం మార్కెటింగ్‌ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్‌లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్‌ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది.

మరిన్ని వార్తలు