సెమీ కండక్టర్‌ తయారీలో టాటా గ్రూప్‌.. 40వేల కోట్ల పెట్టుబడులతో

9 Dec, 2023 11:11 IST|Sakshi

ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్‌ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా అస్సాంలో దాదాపు రూ. 40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.

ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మాకు శుభపరిణామం. టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాగీరోడ్‌లో ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తును సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ఆమోదం కోసం కేంద్రాన్ని సంప్రదించాం. త్వరలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని శర్మ చెప్పారు.

‘‘టాటా కంపెనీ అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు రూ.40 వేల కోట్లతో చిప్‌ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది.సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంట్‌పై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరిపిందని, ఇక్కడ చర్చల అనంతరం కేంద్రాన్ని సంప్రదించాం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వచ్చేలా చూస్తామని, పారిశ్రామికీకరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఒకట్రెండు నెలల్లో తుది ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని  అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు.

>
మరిన్ని వార్తలు