IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..

26 Oct, 2023 12:31 IST|Sakshi

ఐపీఓకు రానున్న డజన్‌ కంపెనీలు

20ఏళ్ల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి టాటా టెక్నాలజీస్‌

ఇప్పటికే 36 కంపెనీల ద్వారా రూ.28వేల కోట్లు సమీకరణ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని  నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్‌ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్‌ ఇష్యూ తేదీలను ప్రకటించింది.

టాటా టెక్నాలజీస్‌, మామాఎర్త్‌, ఏఎస్‌కే ఆటోమోటివ్‌, ప్రోటీన్‌ ఈగవ్‌ టెక్‌, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌, క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ పబ్లిక్‌ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్‌ ఐపీఓ అక్టోబర్‌ 30న ప్రారంభమై నవంబర్‌ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది.

మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓ అక్టోబర్‌ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్‌ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్‌ ఐపీఓగా వచ్చింది. 

హొనాస కన్జ్యూమర్‌(మామాఎర్త్‌ మాతృసంస్థ) పబ్లిక్‌ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్‌ ఇగవ్‌ టెక్‌, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్‌కే ఆటోమోటివ్‌ సైతం నవంబర్‌లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్‌ఎస్‌ కింద జారీ చేయనున్నారు. 

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. 

కంపెనీలు సమీకరించనున్న మొత్తం

  • టాటా టెక్నాలజీస్‌: రూ.2500 కోట్లు
  • సెల్లోవరల్డ్‌: రూ.1900 కోట్లు
  • హొనాస కన్జ్యూమర్‌:రూ.1650 కోట్లు
  • ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్సియల్‌: రూ.1400 కోట్లు
  • ప్రొటీన్‌ ఈగోవ్‌టెక్‌: రూ.1300 కోట్లు
  • డీఓఎంఎస్‌ ఇండస్ట్రీస్‌:రూ.1200 కోట్లు
  • ఏఎస్‌కే ఆటోమోటివ్‌:రూ.1000 కోట్లు
  • జనస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: రూ.1000 కోట్లు
  • ఫిన్‌కేర్‌ మైక్రోఫైనాన్స్‌: రూ.900 కోట్లు
  • బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌: రూ.840 కోట్లు
  • ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌: రూ.800 కోట్లు
  • ఈసాఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: రూ.630 కోట్లు
మరిన్ని వార్తలు