భారత్‌లో టయోటా మూడవ ప్లాంట్‌!

28 Sep, 2023 06:14 IST|Sakshi

ఈ కేంద్రం నుంచే కొత్త ఎస్‌యూవీ

భారత్‌ కోసం మినీ ల్యాండ్‌ క్రూజర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్‌ సంస్థ టయోటా మోటార్‌.. భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు.

ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌కు మలీ్టపర్పస్‌ వెహికిల్‌ ఇన్నోవా హైక్రాస్‌కు మధ్య ఈ మోడల్‌ ఉండనుంది.

340–డి కోడ్‌ పేరుతో రానున్న ఈ ఎస్‌యూవీ మోడల్‌ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్‌లో మినీ ల్యాండ్‌ క్రూజర్‌ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్‌లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది.   

మరిన్ని వార్తలు