ఈ కారు బుక్‌ చేస్తే నిజంగా నాలుగేళ్లు ఆగాల్సిందేనా? టయోటా ఏం చెప్పిందంటే..

22 Jan, 2022 21:21 IST|Sakshi

This Toyota Car Will Deliver After 4 Years:  ఆ కారును బుక్‌ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్‌ కార్‌ మేకర్‌ టయోటా స్పందించింది. 


టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ ఎల్‌సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్‌ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా.  నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్‌లోకి రావొచ్చని భావించారు. అయితే.. 

సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్‌ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది.  ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్‌లపై పడనుంది. 

భారత మార్కెట్‌లో టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ ఎల్‌సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్‌ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్‌ లభించనున్నాయి. నిస్సాన్‌ పాట్రోల్‌, బెర్సిడెజ్‌ బెంజ్‌ జీఎస్‌, బీఎండబ్ల్యూ ఎక్స్‌ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు