భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో

3 Nov, 2023 13:59 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీనర్ ఫ్యూయెల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని గత కొన్ని రోజులుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ఒక వీడియోలో తన గ్యారేజిలోని ప్రపంచంలోనే మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

సాధారణంగా రాజకీయ నాయకులు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను వినియోగిస్తారు. కానీ గడ్కరీ దీనికి భిన్నంగా ఇథనాల్ శక్తితో నడిచే 'ఇన్నోవా హైక్రాస్' ప్రోటోటైప్ హైబ్రిడ్ కారుని ఉపయోగిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో ప్రజలకు చెప్పడమే కాకుండా.. తానూ ఆచరిస్తుండటం నిజంగా గొప్ప విషయం.

ఈ వీడియోలో తన కారు గురించి వెల్లడిస్తూ.. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనమని తెలిపారు. దీనికి కావలసిన ఇంధనం రైతుల దగ్గర నుంచి లభిస్తుందని, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, పెట్రోల్ కంటే చౌకగా లభిస్తుందని పేర్కొన్నాడు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహనాలు త్వరలోనే మార్కెట్లో లభిస్తాయని, ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ద్వారా ఇటువంటి ఇంధనాలను అందించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇథనాల్ నుంచి ఏవియేషన్-గ్రేడ్ ఇంధనాన్ని వెలికితీసే పనిలో ఉందని తెలిపారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే పెట్రోలియం దిగుమతులు రానున్న రోజుల్లో తగ్గుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి!

నితిన్ గడ్కరీ గ్యారేజీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే టయోటా మిరాయ్ కారు కూడా కనిపిస్తుంది. ఇది ఫ్యూచరిస్టిక్ కారు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కారు 1.2 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ, మూడు హైడ్రోజన్ ట్యాంకులు కలిగి ఉంటుంది. కావున ఇది 647 కి.మీ రేంజ్ అందిస్తుంది.

మరిన్ని వార్తలు