టీవీఎస్‌–బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీ ప్రారంభం

7 Oct, 2023 07:59 IST|Sakshi

హోసూరు: బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ సహకారంతో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, తొలి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం ‘సీఈ 2’ తయారీని శుక్రవారం హోసూరు ప్లాంట్‌లో ప్రారంభించింది. బీఎండబ్ల్యూ, టీవీఎస్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ జీ310 సీసీ మోటారు సైకిల్‌ లక్షన్నర వాహనాన్ని విడుదల చేశారు. టీవీఎస్‌ మోటార్, బీఎండబ్ల్యూ మోటార్‌ సంయక్తంగా బీఎండబ్ల్యూ జీ310ఆర్, బీఎండబ్ల్యూ 310 జీఎస్, బీఎండబ్ల్యూ జీ310ఆర్‌ఆర్, టీవీఎస్‌ అపాచే ఆర్‌ఆర్‌ 310, టీవీఎస్‌ అపాచే ఆర్‌టీఆర్‌ 310 వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ సీఈ02ను తొలుత యూరప్‌ మార్కెట్లో విక్రయించనున్నారు. తర్వాత భారత్‌ మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

సీఈ2 తయారీ, 310 సీసీ బైక్‌ 1,50,000 యూనిట్‌ను ఒకే రోజు ఉత్పత్తి చేయడం ప్రత్యేక సందర్భంగా కంపెనీ సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ గ్రూప్‌ విక్రయాల్లో టీవీఎస్‌ మోటార్‌ వాటా 12 శాతంగా ఉంటుందని తెలిపారు. రెండు గ్రూపుల మధ్య బంధం మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు