Russia Fined On US Tech Companies: అమెరికన్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోన్న రష్యా! ట్విటర్‌తో పాటుగా..! 

23 Dec, 2021 18:56 IST|Sakshi

ప్రముఖ సోషల్‌మీడియా, మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ దిగ్గజం ట్విటర్‌కు రష్యా మరోసారి గట్టి షాకిచ్చింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు గాను ట్విటర్‌కు 3 మిలియన్ రూబెల్స్‌ (దాదాపు రూ. 30 లక్షలు) జరిమానా విధించినట్లు మాస్కో కోర్టు గురువారం తెలిపింది. ట్విటర్‌తో పాటుగా మైక్రోసాఫ్ట్‌ కొనుగోలుచేసిన గిట్‌హాబ్‌పై కూడా భారీ జరిమానాను విధించినట్లు తెలుస్తోంది. దాదాపు ఒక మిలియన్‌ రూబెళ్ల(దాదాపు రూ. 10 లక్షలు)ను ఫైన్‌ వేసింది. గత కొంతకాలంగా విదేశీ టెక్‌ కంపెనీలకు రష్యా ప్రభుత్వం జరిమానాలను విధిస్తూనే ఉంది. యూఎస్ ఆధారిత టెక్ కంపెనీలపై రష్యా ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. 

నిరాకరించిన ట్విటర్‌..!
చట్టవిరుద్దమైన కంటెంట్‌ను తొలగించనందుకుగాను కంపెనీపై రష్యా ప్రభుత్వం చేసిన ఆరోపణలను ట్విటర్‌ ఖండించింది. చట్ట విరుద్దంగా ఎలాంటి చర్యలకు కంపెనీ పాల్పడలేదని ట్విటర్‌ పేర్కొంది. 

అమెరికన్‌ కంపెనీలపై కక్ష్య..!
2021లో అమెరికన్‌ కంపెనీలపై రష్యా ప్రభుత్వంపై పదుల సంఖ్యలో భారీ జరిమానాలను విధించింది. ఆయా బిగ్ టెక్‌  కంపెనీలపై అక్కడి ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని పెంచింది. ఇంటర్నెట్‌ వినియోగంపై కఠినమైన నియంత్రణలను రష్యన్ అధికారులు చేసిన ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణించారు. ఇది ఆయా కంపెనీల వ్యక్తిగత, కార్పొరేట్ స్వేచ్ఛను అణిచివేస్తోందని అన్నారు.

చదవండి: మొబిక్విక్‌ సిస్టమ్స్‌, స్పైస్ మనీపై ఆర్​బీఐ భారీ జరిమానా

మరిన్ని వార్తలు