ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ

13 Apr, 2023 04:13 IST|Sakshi

ఇది తాత్కాలిక పరిణామమే

ఇకపై పెరగొచ్చు

అమ్మకాల లక్ష్యాలు చేరుకుంటాం

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ అంచనాలు

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్‌ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్‌ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి.

ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్‌ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్‌ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

కొంత తగ్గాయి..
అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ గౌరవ్‌ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్‌ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

పెంటప్‌ డిమాండ్‌ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్‌ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్‌ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సతీష్‌ ఎన్‌ఎస్‌ పేర్కొన్నారు.

వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్‌ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్‌ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్‌ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అప్లయ న్సెస్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) పేర్కొంది.

ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్‌ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్‌లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు.

‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్‌ భాగస్వాములు కూలింగ్‌ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు