వేలకోట్ల రుణ భారం, వొడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం!

27 Jun, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్‌ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్‌ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016–17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్‌ 15న డిమాండ్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 

2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్‌ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా  మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్‌ చేసినట్టు తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018–19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.    

మరిన్ని వార్తలు