నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

25 Oct, 2023 11:42 IST|Sakshi

ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ సంస్థ మొబైల్‌ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్‌ఫోన్‌లో కంప్యూటర్‌ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు.

2014లో మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్‌ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది.

మరిన్ని వార్తలు