ఈ సెట్టింగ్స్ తో వాట్సప్‌ ఖాతా మరింత సురక్షితం

18 Nov, 2020 16:59 IST|Sakshi

ప్రస్తుత ప్రపంచంలో ఏ చిన్న అవసరానికైనా మనం నిత్యం ఉపయోగించేది మెసేజింగ్ యాప్ వాట్సప్‌. మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఆడియోలు... ఇలా ఏది పంపాలన్నా వాట్సాప్ పై బాగా ఆధారపడుతున్నాం. ఇది అంతలా మన జీవితంలో మమేకమైపోయింది. ఇంతలా వాడుతున్న వాట్సప్ లో తెలియకుండా చేసే చిన్నతప్పులు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి. పరిచయం లేని, తాత్కాలిక అవసరంతో పరిచయమైన వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను మన మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవడం వల్ల తర్వాత ఎప్పుడో ఒక్కసారి చెక్‌ చేసుకుంటే వీళ్లు ఎవరబ్బా అని అనుకుంటాం. మనం వాట్సాప్ లో మార్చే డీపీ (ప్రొఫైల్‌ ఫొటో), స్టేటస్‌లకు సంబంధించిన సమాచారం వారికి కూడా కనిపిస్తుంటుంది. దీని ద్వారా వాళ్ళు మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే మనం అవసరం లేని కాంటాక్ట్‌లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదా డిలీట్ చేయడం మంచిది. 

అలాగే మీ స్టేటస్ యొక్క ఫోటోలు పరిచయం లేని వ్యక్తులకు కనిపించకుండా ఉంచితే మంచిది. మీకు తెలియని వాళ్లను మీ స్టేటస్‌ చూడకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మీ స్టేటస్‌ యొక్క‌ ప్రైవసీలో మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. ‘మై కాంటాక్ట్స్’‌, ‘మై కాంటాక్ట్స్ కాకుండా‌..’, ‘ఓన్లీ షేర్ విత్..‌’ మొదటిది ఎంచుకుంటే... మీ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ఉన్న అందరూ చూస్తారు. రెండోది.. సెలెక్ట్‌ చేసుకున్న కాంటాక్ట్స్‌లో మీరు ఎంచుకున్న వాళ్లకు తప్పించి అందరికీ కనిపిస్తుంది. మూడోది.. మీరు సెలెక్ట్‌ చేసుకున్న కొంతమంది కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. అలాగే మీ సిమ్ ఎప్పుడైనా మార్చినప్పుడు, లేదా మీ ఫోన్‌ను దొంగలించిన సమయంలో.. మీ వాట్సాప్‌ ఖాతాను ఇతరులు వాడకుండా టూ-స్టెప్‌ వెరిఫికేషన్ అడ్డుకుంటుంది. కాబట్టి దీని కోసం సెట్టింగ్స్‌ -> అకౌంట్‌ -> టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌కు వెళ్లి ఎనేబుల్‌ చేసుకుంటే.. మీ వాట్సాప్‌ ఖాతా అనేది చాల సురక్షితంగా ఉంటుంది. (చదవండి: అందరికి అందుబాటులోకి వాట్సాప్ కొత్త‌ ఫీచర్)

మరిన్ని వార్తలు