Luxury Homes: లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు!

25 Aug, 2022 18:13 IST|Sakshi

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. బ్యాంక్‌ అకౌంట్‌లో లక్షల కోట్లున్నా.. సొంతిల్లు లేకపోతే సంతృప్తిగా ఉండలేరు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కోవిడ్‌-19 కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. శాలరీ కటింగ్‌లు, నిరుద్యోగం పట్టి పీడించింది. దీంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు అడి అశలయ్యాయి. అయితే లగ్జరీ ఇళ్ల విషయంలో అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయులు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ గ్రూప్‌ లగ్జరీ ఇళ్ల విక్రయాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..హెచ్‌1 (ఫస్ట్‌ ఆఫ్‌ కేలండర్‌ ఇయర్‌) జనవరి - మార్చి 2022లో మొత్తం ఏడు నగరాల్లో 1.84లక్షల యూనిట్లను అమ్మగా..అందులో 14శాతం లగ్జరీ ఇళ్లే ఉన్నాయని హైలెట్‌ చేసింది. దీనికి విరుద్ధంగా, 2019 మొత్తంలో విక్రయించిన 2.61 లక్షల యూనిట్లలో కేవలం 7 శాతం మాత్రమే లగ్జరీ కేటగిరీలో ఉన్నాయి”అని అనరాక్  నివేదిక పేర్కొంది.

బడ్జెట్‌ ధరలో (రూ.40 లక్షల లోపు ధర కలిగిన యూనిట్లు)ఉన్న ఇళ్ల అమ్మకాల వాటా 2019లో 38 శాతం నుండి ఈఏడాది జనవరి-మార్చి సమయానికి 31 శాతానికి పడిపోయాయి. కోవిడ్‌-19 పరిస్థితులు అదుపులోకి రావడంతో ఇళ్లను కొనుగోలు చేయాలని భావించినా.. అందుకు ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదని తెలుస్తోంది.

 

“ఇక లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకోవాలని కొనుగోలు దారులపై మహమ్మారి ప్రభావం చూపింది. అయినప్పటికి వారికి వచ్చే అధిక ఆదాయం లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు దోహద పడినట్లు అనరాక్‌ నివేదిక తెలిపింది. డెవలపర్‌ల తగ్గింపులతో కొనుగోలుదారులకు లగ్జరీ ఇళ్లపై మక్కువ పెరిగింది. దేశంలో అనుకూల పరిస్థితుల కారణంగా ఎన్‌ఆర్ఐలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు”అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు.

చదవండి👉 రీసేల్‌ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!

మరిన్ని వార్తలు