మూన్‌లైటింగ్‌ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’

17 Oct, 2022 20:21 IST|Sakshi

టెక్నాలజీ రంగంలో మూన్‌లైటింగ్‌ దుమారం కొనసాగుతుంది. ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో దేశీయ టెక్‌ కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో టెక్‌ సంస్థ టీసీఎస్‌ స్పందించింది. మూన్‌లైటింగ్‌ అంశంలో ఆయా సంస్థలు ఉద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులు కోరుతున్నారు. 

ఇటీవల బెంగళూరు కేంద్రంగా ఓ ఐటీ ఉద్యోగికి 7 పీఎఫ్‌ అకౌంట్‌లు ఉన్నట్లు తేలడంతో ఈ మూన్‌ లైటింగ్‌ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో టెక్‌ కంపెనీలు ఒకటికి మించి ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై వేటు (విప్రో 300మంది ఉద్యోగుల్ని తొలగించింది) వేస్తున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి శుభం కార్డు పలుకుతున్నాయి. ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌కు వచ్చేది లేదని అంటున్నారు. కాదు కూడదు అంటే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పించే సంస్థల్లో చేరుతామని తెగేసి చెబుతున్నారు.

చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!

ఈ తరుణంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డ ఉద్యోగులపై సంస్థలు తీసుకుంటున్న చర్యల్ని  టీసీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) ఎన్‌. గణపతి సుబ్రహ్మణ్యం ఖండించారు. మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలు ఉద్యోగి కెరియర్‌ను నాశనం చేస్తుంది. సమస్యను పరిష్కరించేటప్పుడు సంస్థలు ఉద్యోగుల పట్ల సానుభూతి చూపడం చాలా అవసరమని తెలిపారు.

మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలతో బయటపడితే సంస్థలు ఉద్యోగులపై కంపెనీలు చర్యలు తీసుకోకుండా ఉండలేవు. ఎందుకంటే ఇది అగ్రిమెంట్‌లో ఓ భాగం. కాబట్టే రెండేసి ఉద్యోగాలు చేయడాన‍్ని మానుకోవాలని అన్నారు. ‘‘ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే దాని పర్యవసానంగా వారి కెరీర్‌ నాశనం అవుతుంది. మరో సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే.. బ్యాంగ్రౌండ్‌ వెరిఫికేషన్‌లో ఉద్యోగి గతంలో మూన్‌లైటింగ్‌ పాల్పడినట్లు తేలుతుంది. అందుకే ఉద్యోగుల పట్ల  మనం కొంత సానుభూతి చూపాలి’’ అని చెప్పారు. సంస్థలు ఒక ఉద్యోగిని కుటుంబ సభ్యుడిగా భావిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ కుటుంబ సభ్యులు తప్పు దారి పట్టకుండా నిరోధించడంపై దృష్టి సారిస్తాయని ఎన్‌. గణపతి సుబ్రహ్మణ్యం అన్నారు.

చదవండి👉 మూన్‌ లైటింగ్‌ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!

మరిన్ని వార్తలు