విప్రో సీఎఫ్‌వోగా అపర్ణ అయ్యర్‌.. గోల్డ్‌ మెడల్‌ సీఏ ఈమె..

22 Sep, 2023 18:31 IST|Sakshi

భారత ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణ అయ్యర్‌ (Aparna Iyer) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ సీఎఫ్‌వోగా ఉన్న జతిన్ దలాల్ సెప్టెంబర్ 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్‌ను విప్రో నియమించింది.

అపర్ణ అయ్యర్ 20 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 2003లో చేరినప్పటి నుంచి కంపెనీకి వివిధ సీనియర్ స్థానాల్లో సేవలందించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది.

(ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్‌ 20 లిస్ట్‌! ఐటీ కంపెనీలదే హవా..)

రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అయ్యర్ విప్రో సంస్థలో కీలకమైన నాయకత్వ స్థానాలను నిర్వహించి  అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆమె విప్రో క్లౌడ్ సర్వీసెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీజీవోగా బాధ్యతలు నిర్వహించారు.

ఇంటర్నల్‌ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్‌ అనాలిసిస్‌, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌ వంటి ఆర్థిక సంబంధమైన అంశాల్లో విశేషమైన నైపుణ్యం ఉన్న అపర్ణ అయ్యర్‌ ఆయా అంశాల్లో పలు కీలక పోస్టులను నిర్వహించారు.

అపర్ణ అయ్యర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ 2002 బ్యాచ్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేతగా గుర్తింపు పొందారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చేరడానికి ముందు అయ్యర్ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

(Tech Jobs: టెక్‌ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక రానున్నవి మంచి రోజులే..!)

“నిష్ణాతురాలైన అపర్ణ ఫలితాలతో నడిచే లీడర్‌. విప్రోతో తన 20 ఏళ్ల కెరీర్‌లో ఆమె మా బిజినెస్‌ లీడర్లకు డైనమిక్, ఫార్వర్డ్ థింకింగ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు” అని విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు.

విప్రో సీఎఫ్‌ఓగా నియమితులైన తర్వాత అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ  "విప్రోకి ఈ ముఖ్యమైన తరుణంలో సీఎఫ్‌ఓ బాధ్యతలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీని స్థిరమైన వృద్ధివైపు నడిపించడానికి, వాటాదారులకు విలువను సృష్టించడానికి సీఈవో థియరీతో, మా ఫైనాన్స్ బృందం, మొత్తం సంస్థతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు