టీసీఎస్‌లో పెరిగిన మహిళా ఉద్యోగుల వలసలు

8 Jun, 2023 06:29 IST|Sakshi

పురుషులతో సమాన స్థాయికి అట్రిషన్‌

ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌లో మహిళల అట్రిషన్‌ రేటు (వలసలు/కంపెనీని వీడడం) పురుషులతో సమాన స్థాయికి పెరిగింది. ఈ విషయాన్ని కంపెనీ మానవ వనరుల ముఖ్య అధికారి మిలింద్‌ లక్కడ్‌ వెల్లడించారు. చారిత్రకంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఉద్యోగుల అట్రిషన్‌ రేటు తక్కువగా ఉండేదంటూ, ప్రస్తుత పరిస్థితిని అసాధారణంగా పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేసే విధానానికి ముగింపు పలకడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం (6 లక్షల మందికి పైగా) మహిళలే కావడం గమనార్హం.

‘‘కరోనా సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి ఏర్పాట్ల విషయంలో మార్పులకు దారితీసి ఉండొచ్చు. ఇదే వారిని తిరిగి కార్యాలయాలకు రానీయకుండా చేయవచ్చు’’అని మిలింద్‌ లక్కడ్‌ కంపెనీ వార్షిక నివేదికలో అభిప్రాయపడ్డారు. లింగ వైవిధ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీకి పెరిగిన మహిళల అట్రిషన్‌ రేటు ప్రతికూలమన్నారు. దీన్ని తగ్గించడంపై కంపెనీ దృష్టి పెడుతుందన్నారు. మార్చి నాటికి టీసీఎస్‌లో మొత్తం మీద అట్రిషన్‌ రేటు 20 శాతం స్థాయిలో ఉండడం గమనార్హం.  

రాజేజ్‌ గోపీనాథన్‌కు రూ.29 కోట్లు
 టీసీఎస్‌ సంస్థ 2022–23 సంవత్సరానికి గాను సీఈవో స్థానంలో ఉన్న రాజేష్‌ గోపీనాథన్‌కు రూ.29.16 కోట్ల పారితోషికాన్ని చెల్లించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.17 శాతం ఎక్కువ. ఆరేళ్లుగా టీసీఎస్‌ను నడిపించిన గోపీనాథన్‌ ఇటీవలే సీఈవోగా వైదొలగగా కే.కృతివాసన్‌ ఈ బాధ్యతల్లోకి రావడం తెలిసిందే. కొత్త సీఈవో కృతివాసన్‌కు ప్రతి నెలా రూ.10 లక్షలు బేసిక్‌ వేతనంగా కంపెనీ చెల్లించనుంది. ఇది రూ.16 లక్షల వరకు పెరుగుతూ వెళుతుంది. బోర్డు నిర్ణయించిన మేరకు కమీషన్, అద్దెలేని నివాస వసతి తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇక కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌జీ సుబ్రమణియమ్‌ గత ఆర్థిక సంవత్సరానికి రూ.23.60 కోట్ల పారితోషికాన్ని (13.58 శాతం అధికం) పొందారు.

మరిన్ని వార్తలు