World Heritage Day: చికుబుకు చికుబుకు రైలే.. ఇది కదలదు అది లేకపోతే..

18 Apr, 2022 15:33 IST|Sakshi

బుల్లెట్‌ రైళ్ల యుగం వచ్చినా ఇప్పటికీ స్టీమ్‌ ఇంజన్‌తో నడిచే హెరిటేజ్‌ రైళ్లకు ఆదరణ తగ్గలేదు. రెగ్యులర్‌ ప్రయాణికులు తగ్గిపోయినా టూరిజం, సినిమా షూటింగుల పరంగా హెరిటేజ్‌ రైళ్లకు ఫుల్‌ గిరాకీ ఉంది. ముఖ్యంగా బ్రిటన్‌ దేశంలో హెరిటేజ్‌ రైళ్లు ఇప్పటికీ పట్టాలపై చుక్‌బుక్‌ చుక్‌బుక్‌ అంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ సర్వీసులకు ఇప్పుడు ఊహించని రీతిలో సమస్యలు వచ్చి పడ్డాయి.

మన దగ్గర ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో రాజస్థాన్‌లో స్టీమ్‌ ఇంజన్‌ రైలు నడుస్తోంది. ఇదే తరహాలో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అత్యధికంగా హెరిటేజ్‌ సర్వీసులు బ్రిటన్‌లో నడుస్తున్నాయి. ఈ రైళ్లు నడిచేందుకు ఇంధనంగా బొగ్గును ఉపయోగిస్తారు. రైళ్లలో ఉపయోగించేందుకు అవసరమైన బొగ్గును సౌత్‌ వేల్స్‌లో ఉన్న ఫ్రోస్‌ వై ఫ్రాన్‌ మైనింగ్‌ సం‍స్థ ఉత్పత్తి చేసేది. ఈ మైన్‌ కాలపరిమితి కంటే ముందుగానే 2022 జనవరిలో ఇక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి.

మరోవైపు హెరిటేజ్‌ రైళ్లకు అవసరమైన బొగ్గులో కొంత మొత్తాన్ని రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచి బ్రిటన్‌ దిగుమతి చేసుకునేది. కాగా ఫ్రిబవరిలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవడంతో అక్కడి నుంచి కూడా దిగుమతి ఆగిపోయింది. దీంతో హెరిటేజ్‌ రైళ్లకు అవసరమైన బొగ్గు తగ్గిపోయింది. ప్రస్తుతం ఉ‍న్న నిల్వలు 2022 మే 31 వరకే సరిపోతాయని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ యుద్ధం ముగియని పక్షంలో మరో నెల రోజులకు మించి ఈ రైళ్లను నడిపించే పరిస్థితి లేదంటున్నాయి బ్రిటన్‌లోని హెరిటేజ్‌ రైల్‌ సర్వీసెస్‌ అందిస్తున్న కంపెనీలు. బొగ్గు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎక్కడ సానుకూల ఫలితాలు కనిపించడం లేదంటున్నాయి. 

చదవండి: ఏడాది కాలంలో రికార్డ్‌ స్థాయిలో పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌ ధరలు..ఎందుకంటే!

మరిన్ని వార్తలు