లాభాల్లోకి యస్‌ బ్యాంక్‌ 

2 May, 2022 02:23 IST|Sakshi

2021–22లో రూ. 1,066 కోట్లు 

ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్‌ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్‌ సీఈవో, ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్‌ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్‌చేసి రూ. 1,819 కోట్లను తాకింది.

నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్‌ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్‌గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్‌ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు