ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం.. 36 శాతం వృద్ధి

21 Oct, 2023 20:22 IST|Sakshi

దిగ్గజ ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండలోన్‌ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. 

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్‌ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు