Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం 

10 Jan, 2024 02:04 IST|Sakshi

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పష్టికరణ 

న్యూఢిల్లీ:  సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ – సీఎంఈపీఎల్‌) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (జీల్‌) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్‌ సీఈవో పునీత్‌ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్‌ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్‌ రెండేళ్ల క్రితం డీల్‌ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్‌ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్‌ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది.

అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.   

>
మరిన్ని వార్తలు