వెహికల్‌ స్క్రాపింగ్‌, మరో యూనిట్‌ ప్రారంభించిన టాటా మోటార్స్‌

30 Nov, 2023 19:55 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను చండీగడ్‌లో ప్రారంభించింది. ఇప్పటికే టాటా జైపూర్‌, భువనేశ్వర్, సూరత్‌లో స్క్రాపింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగాచండీగడ్‌లో ప్రారంభించిన ఈ స్క్రాపింగ్‌ యూనిట్‌లో ఏడాదికి 12,000 వాహనాల్ని చెత్తగా మార్చనుంది.  

దేశంలో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహ‌నాల‌ను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాల‌సీని తీసుకువ‌చ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవ‌రైనా త‌మ వాహ‌నాల‌ను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్స‌హాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్‌ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది.
 
ఇందులో భాగంగా పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్‌ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్‌, ప్లాస్టిక్‌ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

ఆటోమొబైల్‌ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35)తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్‌ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది.   

మరిన్ని వార్తలు