Zilingo CEO Ankiti Bose: 23 ఏళ్లకే స్టార్టప్‌.. త్వరలో యూనికార్న్‌ హోదా.. ఇంతలో..

14 Apr, 2022 11:47 IST|Sakshi

భారత్‌పే అశ్నీర్‌ గ్రోవర్‌ ఉదంతం తెరమరుగు కాకముందే అలాంటిదే మరో వ్యవహారం వెలుగు చూసింది. రేపోమాపో యూనికార్న్‌ హోదా దక్కించుకోబోతున్న స్టార్టప్‌ పునాదులు కదిలిపోయాయి. అవమానకర రీతిలో ఆ స్టార్టప్‌ ఫౌండర్‌ కమ్‌ సీఈవో బయటకు వెళ్లాల్సి వచ్చింది. అది కూడా యువ మహిళా ఫౌండర్‌ కావడంతో ఈ అంశంపై బిజినెస్‌ సర్కిల్స్‌లో భారీ చర్చ నడుస్తోంది.

ముంబై నుంచి మొదలు
ముంబైకి చెందిన అంకితా బోస్‌ అక్కడే ఉన్నత విద్యాభ్యాసం  పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో ఓ బహుళ జాతి కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరారు. అయితే బిజినెస్‌ ట్రిప్‌లో భాగంగా బ్యాంకాక్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమె మదిలో మెదిలిన ఐడియా ఓ స్టార్టప్‌కి ప్రాణం పోసింది. స్ట్రీట్‌ వెండర్స్‌కి ఆన్‌లైన్‌లో బిజినెస్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ జిలింగో ఈ కామర్స్‌ సైట్‌ని పరిచయస్తుడైన ద్రువ్‌కపూర్‌తో పాటు మరికొందరితో కలిసి 2015లో ప్రారంభించింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు కావడం గమనార్హం.

నిధుల దుర్వినియోగం
2015లో సింగపూర్‌ కేంద్రంగా మొదలైన జిలింగో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇన్వెస్టర్లను సాధించింది. మార్కెట్‌లో నిలదొక్కుకోగలిగింది. తాజాగా మరో విడత పెట్టుబడుల సమీకరణలో భాగంగా దాదాపు 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించింది. ఈ కమ్రంలో కంపెనీ పత్రాలను పరిశీలించగా మొదటి విడతలో సేకరించిన నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దీనికి అంకిత బోస్‌ కారణమని పేర్కొంటూ ఆమెను జిలింగో నుంచి సాగనంపారు.

 

నన్ను టార్గెట్‌ చేశారు
జిలింగోలో కొందరుకు కుట్ర పూరితంగా వ్యవహరించి తనను  ‘టార్గెట్‌’ చేశారని అంకితి బోస్‌ అంటున్నారు. ఈ క్రమంలో తనపై లేనిపోని నిందలు వేశారని  చెబుతున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, తనను తప్పుడు ఆరోపణలపై కంపెనీ నుంచి బయటకు పంపడంపై న్యాయ పోరాటం చేస్తానంటూ ఆమె ప్రకటించారు. 

చివరి మెట్టులో
23 ఏళ్ల వయసులో జిలింగో స్టార్టప్‌ ప్రయాణం మొదలైతే 2019 నాటికి ఆగ్నేయాసియా దేశాల్లో ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీగా ఎదిగింది. కోవిడ్‌ ముందు నాటికే 970 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించింది. ఇక రేపోమాపో యూనికార్న్‌ హోదా అనుకునే సమయంలో అంకితీ బోస్‌కి షాక్‌ తగిలింది. ఏది ఏమైనా యువతరంలో ఎంతో స్ఫూర్తి నింపుతున్న స్టార్టప్‌ ప్రపంచంలో అశ్నీర్‌, అంకితీ లాంటి వ్యవహారాలు సరికొత్త చర్చకు తెరతీశాయి.

చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్‌' నిధుల దుర్వినియోగంపై సమీర్‌!

మరిన్ని వార్తలు