పవిత్రం..పునీతం

19 Nov, 2023 01:42 IST|Sakshi

సిరులతల్లి కరుణాకటాక్ష వీక్షణాల కోసం భక్తకోటి తరలివచ్చింది.. పల్లకిపై ఊరేగుతున్న పద్మావతీదేవిని దర్శించుకుని పులకించింది.. అమ్మ ఆవిర్భవించిన పద్మసరోవరంలో నిర్వహించిన పంచమీ తీర్థంలో పాలుపంచుకుని పరవశించింది. పవిత్ర పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి పునీతమైంది.

చంద్రగిరి(తిరుచానూరు) : శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరంలో శనివారం పంచమితీర్థాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం పల్లకీ ఉత్సవం అనంతరం అమ్మవారు, చక్రతాళ్వార్లను సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అమ్మవారు, చక్రతాళ్వార్లకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పుట్టిన రోజు కానుకగా అమ్మవారికి శ్రీవారు పంపించిన ఆభరణాలను అలంకరించారు. అనంతరం 12.10 గంటలకు ధనుర్లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. అప్పటికే వేచి ఉన్న వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.

పంచమీ తీర్థం..వైభవోపేతం

పంచమితీర్థ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించినట్టు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. సుమారు 50 వేలమందికిపై భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించారు. అన్ని విభాగాల సిబ్బంది విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. ఈఓ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, సదాభార్గవి, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌, ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖకుమార్‌, సీఈ నాగేశ్వర రావు, డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్‌, లోకనాథం పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీపద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు

ఆగమోక్తంగా పంచమీ తీర్థం

భక్తులతో కిక్కిరిసిన పద్మసరోవరం

శ్రీవారి తరఫున సారె సమర్పించిన టీటీడీ చైర్మన్‌ భూమన

మరిన్ని వార్తలు