నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

6 Feb, 2021 11:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గద్వాల : ఆ యువకుడి చిన్నపాటి నిర్లక్ష్యం.. అతని ప్రాణాన్నే బలిగొనేలా చేసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా.. రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకమ్‌పేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వెంకమ్‌పేటకి చెందిన పేతురు రాజు (24) శుక్రవరాం సాయంత్రం మొబైల్‌కు హేడ్‌సెట్‌ కనెక్ట్‌ చేసి పాటలు వీంటూ గ్రామ శివారులోని రైలు పట్టాలపై వెళ్తున్నాడు. గద్వాల నుంచి హైద్రాబాద్‌ వైపు వెళ్తున్న రైలు డ్రైవర్‌.. పట్టాలపై వెళ్తున్న రాజుని గమనించి హారన్‌ మోగించినప్పటికి అతను అప్రమత్తం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు యువకుడిని 108లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి సుదర్శనం ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

5 నిమిషాల్లో గమ్యం.. అంతలోనే మరణం 
వంగూరు (కల్వకుర్తి): మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతాడుకున్న వ్యక్తిని.. బస్సు రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని తిరుమలగిరి సమీపంలో శ్రీశైలం – హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సలయ్య అనే వ్యక్తి మృతిచెందారు.  వివరాలిలా ఉన్నాయి.. తిరుమలగిరికి చెందిన పొలం సలయ్య(50) కల్వకుర్తి నుంచి టీవీఎస్‌ వాహనంపై తిరుమలగిరికి బయల్దేరాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతాడు అనుకున్న సమయంలో వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన సలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేశాడు. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
చదవండి: కిడ్నాప్‌ డ్రామా: నివ్వెరపోయే విషయాలు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. 

మరిన్ని వార్తలు