అత్యాచారం: ‘టీచర్‌ ఒత్తిడి వల్లే అలా చెప్పాను’

6 Feb, 2021 11:17 IST|Sakshi

బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నిందితుడి శిక్ష నిలుపుదల చేస్తూ తీర్పు

ముంబై: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు గతంలో ఈ తరహా కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారగార శిక్షను నిలిపివేస్తూ.. తీర్పు వెల్లడించింది. అంతేకాక నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. సదరు కుర్రాడు తన ఇంట్లో ఉంటున్న మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ.. మూడు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలైన మైనర్‌ బాలిక చదువుకోవడం కోసం తమకు బంధువులు అయిన నిందితుడి ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో 2017 సెప్టెంబర్‌లో బాధితురాలు తన కజిన్‌ తనను అసభ్యకరరీతిలో తాకడాని.. అప్పటి నుంచి తనకు కడుపులో నొప్పి వస్తుందని స్నేహితురాలితో చెప్పింది. 

స్నేహితురాలు ఈ విషయాన్ని క్లాస్‌ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సదరు బాలికను పిలిచి.. విషయం ఏంటని ఆరా తీయగా.. కజిన్‌ తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. టీచర్‌ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో 2018, మార్చి 3న సదరు యువకుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిసింది. ఆ తర్వాత నిందితుడికి దిగువ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో అతడు హై కోర్టును ఆశ్రయించాడు. బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశాడు. ఇక దీని విచారణ సందర్భంగా కోర్టు మైనర్‌ బాలిక స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసింది. 

ఈ సందర్బంగా బాలిక సంచలన విషయాలు వెల్లడించింది. తమ ఇద్దరి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని.. ఇలా నాలుగైదు సార్లు తమ మధ్య చోటు చేసుకుందని తెలిపింది. టీచర్‌ బలవంతం మీదనే తాను అలా చెప్పానని పేర్కొంది. సాక్ష్యాలను పరిశీలించిన జస్టిస్‌ షిండే.. ‘‘మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగిన శృంగారం గురించి చట్ట పరంగా అస్పష్టంగా ఉంది. మైనర్ల అనుమతిని పరిగణలోకి తీసుకోలేం. ఇక ఈ కేసులో వెల్లడైన వాస్తవాలు విలక్షణమైనవి. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు ఒకే కప్పు కింద ఉంటున్నారు.. పైగా విద్యార్థులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితురాలు తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకున్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అతడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం. బాధితుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు’’ అని కోర్టు సూచించింది. అంతేకాక అతడికి విధించిన శిక్షను నిలుపదల చేస్తూ.. తీర్పు వెల్లడించింది. 

చదవండి: న్యాయాన్యాయాల విచికిత్స
                  ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు

మరిన్ని వార్తలు