30 ఏళ్ల మహిళతో తండ్రి సహాజీవనం.. తట్టుకోలేక కొడుకుల కిరాతకం

19 Oct, 2023 14:57 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తాత, సహజీవనం చేస్తున్న మహిళ మృత్యువాత పడగా.. తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం కాన్పూర్ దేహత్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది..

పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్‌ ప్రకాశ్‌ ద్వివేది(83), అతని కుమారుడు విమల్‌(63), అతని భాగస్వామి ఖుష్బు(30)కలిసి అమ్రోదా పట్టణంలో నివసిస్తున్నారు. విమల్‌ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విమల్‌ కొడుకు లలిత్‌(42), సోదరుడు అక్షత్‌(18) గురువారం ఉదయం తండ్రి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్‌ ప్రకాశ్‌, ఖుష్బును కత్తితో పొడిచి చంపారు.

నిందితుల దాడి నుంచి తప్పించుకొని విమల్‌ ఇంటి నుంచి  బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే మున్నా వెంటనే పక్క ఇంట్లో ఉంటున్న విమల్‌ అన్న కమల్‌కు సమాచారం అందించాడు. అతడువిమల్‌ను జిల్లా ఆసుపత్రికి అటు నుంచి కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్షత్ లలిత్‌లు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే తెలిపారు. విచారణలో రామ్‌ప్రకాష్‌, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు.

మరిన్ని వార్తలు