ఏసీబీ కేసులో ఫిర్యాదీ... సీసీఎస్‌ కేసులో నిందితుడు!

10 Aug, 2020 06:58 IST|Sakshi

బంజారాహిల్స్‌లో స్థలాన్ని  కబ్జా చేసిన అబ్దుల్‌ ఖాలేద్‌ 

ఖాలేద్‌ ఫోర్జరీ వ్యవహారంపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఏసీబీ 

ఇతడితో పాటు మరో నిందితుడి అరెస్టు 

సాక్షి, సిటీబ్యూరో: షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ఆర్‌ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కడానికి, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై రవీందర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడానికి కారణమైన సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలీద్‌ కటకటాల్లోకి చేరారు. బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఇతగాడు ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తన స్నేహితుడిని లీగల్‌ అడ్వైజర్‌గానూ రంగంలోకి దింపినట్లు తేల్చారు. ఈ మేరకు వారిచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఖాలీద్‌తో పాటు అశోక్‌రెడ్డి అనే వ్యక్తినీ అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదివారం వెల్లడించారు.  

ఫోర్జరీ వ్యవహారం బయట పడుతుందని... 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో 7068 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఉంది. అత్యంత ఖరీదైన ఈ çస్థలంపై సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలీద్‌ అనే వ్యక్తి కన్నేశాడు. ఈ స్థలంలోని 4865 చదరపు గజాల స్థలానికి సంబంధించి ఖాలీద్‌ నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డు తొ లగించిన ఇతగాడు తనకు చెందినదిగా పేర్కొంటూ మరో బోర్డు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంపై న్యాయస్థానం నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. తన స్నేహితుడు అశోక్‌రెడ్డిని లీగల్‌ అడ్వైజర్‌గా రంగంలోకి దింపాడు. ఆ స్థలాన్ని ఖాలీద్‌కు అప్పగించాల్సిందిగా కోరుతూ షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో అశోక్‌రెడ్డి ద్వారా దరఖాస్తు చేశారు. విషయం గమనించిన తహసీల్దార్‌ ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌ల్లో బంజారాహిల్స్‌ ఠాణా లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... ఆ స్థలా న్ని మీ పరం చేస్తూ సరిహద్దులు చూపిస్తానంటూ  షేక్‌పేట కార్యాలయం ఆర్‌ఐ నాగార్జున రెడ్డి.. ఖాలీద్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దీని నిమి త్తం తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని ఖాలీద్‌ ను కోరాడు.

మరోపక్క ఇతడిపై బంజారాహిల్స్‌ ఠాణాలో నమోదైన కేసుల్లో అరెస్టు వంటి చర్యలు లేకుండా ఉండేందుకు ఎస్సై రవీందర్‌ రూ.3 లక్షలు డిమాండ్‌ చేశాడు. వీటిలో రూ.1.5 లక్షలు ఖాలీద్‌ నుంచి రవీందర్‌ అందుకున్నాడు. తన ఫోర్జరీ వ్యవహారం బయటపడుతోందని, దీనిపై చర్యలు ఉంటాయని భావించిన ఖాలీద్‌ తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషించాడు. ఈ వ్యవ హారం నుంచి అధికారుల దృష్టి మళ్లించడానికి ఓ పథకం వేశాడు. ఆర్‌ఐ నాగార్జున రెడ్డికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ నగదు తీసుకోవడానికి ఈ ఏడాది మార్చి 6న బంజారాహిల్స్‌లోని హార్లీడేవిడ్‌ సన్‌ షోరూమ్‌ వద్దకు రమ్మన్నాడు. ఈలోపు విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యా దు చేశాడు. దీంతో ఆ రోజు బంజారాహిల్స్‌లో వలపన్నిన ఏసీబీ అధికారులు నాగార్జున రెడ్డిని ట్రాప్‌ చేశారు. అలాగే రవీందర్‌ పైనా ఖాలీద్‌ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో తన కబ్జా, ఫోర్జరీ పత్రాల అంశాలు మరుగున పడిపోతాయని ఖాలీద్‌ భావించాడు. అయితే దీనిపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ గౌస్‌ ఆజాద్‌ నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఖాలీద్, అశోక్‌రెడ్డిల పాత్రలపై ఆధారాలు సేకరించి ఆదివారం ఇద్దరినీ అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా