షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు 

6 Feb, 2024 06:24 IST|Sakshi

తవ్వినకొద్దీ బయటపడుతున్న శివ బాలకృష్ణ అక్రమార్జన 

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ రియల్‌ దందాపై ఏసీబీ ఫోకస్‌ 

అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులపై లోతుగా ఆరా 

ఇప్పటివరకు స్వాదీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి ప్రశ్నలు 

సాక్షి, హైదరాబాద్‌: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతో లింకులపై ఫోకస్‌ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు.  

రెండు రియల్‌ కంపెనీలతో పలు లావాదేవీలు     
ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్‌ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు.

అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్‌ చుట్టూ కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega