వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్‌ హత్య  | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్‌ హత్య 

Published Tue, Feb 6 2024 5:07 AM

Tahsildar was killed with personal transactions - Sakshi

విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్‌ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్‌ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును  సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు.

తహసీల్దార్‌ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నా­డు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.

మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్‌ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్‌ ఆధారంగా చెన్నైకు టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు.

అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్‌పోర్ట్‌ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్‌ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్‌ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. 

బస్సులో చెన్నైకు.. 
బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్‌పుట్టు వద్ద అరెస్ట్‌ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ–
1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్‌ తెలిపారు. కన్వెయన్స్‌ డీడ్స్‌ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్‌ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు.   
   
    

Advertisement

తప్పక చదవండి

Advertisement