సచివాలయ అధికారుల పాత్ర

24 Sep, 2020 03:41 IST|Sakshi

ప్రొద్దుటూరులో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఫోర్జరీ

రూ.9,95,000 కాజేసిన ముగ్గురు నిందితులపై కేసులు 

సాక్షి, అమరావతి: నకిలీ చెక్కులతో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎం ఆర్‌ఎఫ్‌) నుంచి  రూ.117.15 కోట్లు కాజేసే కుట్ర వెనుక రాష్ట్ర సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ అధికారుల సహకారంతోనే నకిలీ ఎస్‌బీఐ చెక్కులతో స్వాహా చేసేందుకు పథకం వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉండటంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)తోనే ఈ కేసు దర్యాప్తు చేయించాలని తాజాగా నిర్ణయించారు. కేసు దర్యాప్తులో సీఐడీ విభాగం ఏసీబీకి సహకరించనుంది.  

► ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీని కోరుతూ రెవెన్యూ శాఖ ఇటీవల లేఖ రాసింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కొల్లగొట్టడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగానికి అప్పగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ క్రమంలో సీఐడీ విభాగం మూడు బృందాలను మంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీకి కూడా పంపింది. 

ఏసీబీకి కేసు ఫైల్‌.. 
► అయితే సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించడంతో ఈ కేసు ఏసీబీతో దర్యాప్తు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు ఏసీబీకి ఫైల్‌ పంపించారు.  
► ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు జరపటంలో ఏసీబీకి సీఐడీ విభాగం సహకారం అందించనుంది. ఈ రెండు విభాగాలు సమన్వయంతో కేసును దర్యాప్తు చేయనున్నాయి.  
► ఈ ఘరానా మోసంలో సూత్రధారులుగా భావిస్తున్న సచివాలయంలోని కొందరు అధికారుల పాత్రను వెలుగులోకి తెస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు