మాజీ ఎంపీపీపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌ 

24 Nov, 2022 05:30 IST|Sakshi
మాట్లాడుతున్న అడిషినల్‌ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ మురళీమోహన్‌

గురువు అభిరామ్‌ సూచనతో శిష్యుడు చంద్రశేఖర్‌ దాడి 

డీఎస్పీ ఎదుట లొంగిపోయిన చంద్రశేఖర్‌  

వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ 

తుని: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదుల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌.. అదే ప్రాంతానికి చెందిన అభిరామ్‌కు శిష్యుడు.

ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేసే వీరు కొంతకాలంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో రిటైర్ట్‌ ఉద్యోగి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోల్నాటి శేషగిరిరావు తనను ఇబ్బందిపెట్టాడని, అతడిని గాయపరిస్తే సొమ్ము ఇస్తానని వారికి గురువు అభిరామ్‌ చెప్పాడు. దీంతో చంద్రశేఖర్‌ తన స్నేహితులతో కలిసి  శేషగిరిరావు కదలికలపై నిఘాపెట్టాడు.

ఈ నెల 17న ఉదయం చంద్రశేఖర్‌ భవానీమాల ధరించి, ముఖానికి మాస్క్‌ పెట్టుకుని తుని సమితి ఆఫీసు వీధిలో నివాసం ఉంటున్న శేషగిరిరావు ఇంటికి మోటారు సైకిల్‌ మీద వెళ్లాడు. భిక్షం అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. శేషగిరిరావు అక్కడే పడిపోయిన కత్తిని తీసుకుని వెంటపడి చంద్రశేఖర్‌ వీపుపై దాడిచేయడంతో గాయమైంది.

శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో  దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఊహాచిత్రం ఆధారంగా విస్తృతస్థాయిలో గాలించారు. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రశేఖర్‌ బుధవారం తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీమోహన్‌కు లొంగిపోయాడు.

మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్, తుని, ప్రత్తిపాడు సీఐలు నాగదుర్గారావు, కిశోర్‌బాబు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు