ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్‌ అరెస్ట్‌?

18 Oct, 2023 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్‌ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి శివరామ్‌ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్‌ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌ మాట్లాడిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

వీడియోలో ఏముందంటే..  ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవల్లిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడు కును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నా.. మేము కాయకష్టం చేసుకుని చదివిస్తున్నం. మా పిల్లలకు కష్టం రాకూడదని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్న. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ను మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు.

మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’ అని మర్రి విజయ వీడియో పోస్టు చేశారు. ‘ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరాం. మా అక్క స్నేహి తురాలి ద్వారా పరిచయమయ్యాడు. వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్‌లో పడింది. సూసైడ్‌ చేసుకుంది’ అని ప్రవల్లిక తమ్ముడు మర్రి ప్రణయ్‌కుమార్‌ మరో వీడియోలో పేర్కొన్నాడు.
చదవండి: నా బిడ్డ చావుపై రాజకీయాలు చేయొద్దు

మరిన్ని వార్తలు