సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు

21 Nov, 2021 19:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడి కొమ్ముబాబు అరాచాకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు ముందు గతంలోనూ ఇలాంటి నేరానికే పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా మరో యువతి తనపై బాబు దాడి చేశాడని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నవంబర్‌ 2న కేబీఆర్‌ పార్క్‌  గేట్‌ నెంబర్‌ 6 వద్ద తనను అడ్డుకొని డబ్బులు లాక్కున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు అరెస్ట్‌ కావడంతో బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కొమ్ము బాబు బాధితులు ఇంకా ఎవరైనా ఉన్న ఉంటే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు.

కాగా  నవంబర్‌ 14న  రాత్రి బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌కు వెళ్లిన చౌరిసియాపై దాడి చేసిన నిందితుడు.. లైంగిక దాడికి యత్నించి ఆమె యాపిల్‌ ఫోన్‌ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.  పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

రెక్కీ చేసి.. 
పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు నిందితుడు వెల్లడించినట్లుగా తేలింది. ఘటన జరిగిన నాటికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ  లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు