ఇంట్లో చెత్త తోస్తుండగా.. వివాహితపై యజమాని లైంగిక దాడికి యత్నం

18 May, 2022 10:48 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, రేణిగుంట: వివాహితపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ అంజూయాదవ్‌ కథనం మేరకు.. రేణిగుంటకు చెందిన నేమిచంద్‌ (57) ఆర్టీసీ బస్టాండు సమీపంలో పీఆర్‌జీ నగలషాపు నడుపుతున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఐదేళ్లుగా అతని షాపులో పని చేస్తున్నాడు. నేమిచంద్‌ భార్య ఊరెళ్లింది.

ఈ క్రమంలో ఇంట్లో పనిచేసేందుకు ఈ నెల 13న తన షాపులో పనిచేస్తున్న వ్యక్తి భార్యను పంపించాలని చెప్పాడు. దీంతో వివాహిత (25) యజమాని ఇంటికి చేరుకుని చెత్త తోస్తుండగా నేమిచంద్‌ వెనుక నుంచి గట్టిగా పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు. తనతో సన్నిహితంగా ఉంటే డబ్బులు, దుస్తులు ఇస్తానని చెప్పి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జరిగిన విషయం భర్తకు చెప్పింది.

చదవండి: (ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు..)

బాధితురాలి భర్త యజమానిని నిలదీయడంతో విషయం ఎక్కడైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తానని, షాపులో నగలు దొంగతనం చేశావని కేసు పెడతానని బెదిరించాడు. దీంతో దంపతులు భయంతో ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ముభావంగా ఉన్న బాధితురాలి భర్తను తమ సమీప బంధువు ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతని సాయంతో మంగళవారం సాయంత్రం బాధితురాలు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.  

చదవండి: (బిడ్డ పుట్టిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నట్టేట ముంచాడు)

మరిన్ని వార్తలు