వెనక నుంచి కారుని ఢీకొట్టడమే కాకుండా.. సిమెంట్‌ దిమ్మెతో

24 Mar, 2021 14:34 IST|Sakshi

బంజారాహిల్స్‌: రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగిన డ్రైవర్‌ను సిమెంటు దిమ్మెతో తలపై బాదిన ఘటనలో క్యాబ్‌ డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం బోర్లమడ్డగడ్డ గ్రామానికి చెందిన గంగాదేవి ప్రకాశ్‌(23) క్యాబ్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

5 రోజుల క్రితం ప్రయాణికుడి కోసం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.2 కృష్ణానగర్‌ రోడ్డులో మోర్‌ సూపర్‌ మార్కెట్‌ ముందు రోడ్డు పక్కన కారు ఆపి ఫొన్‌ మాట్లాడుతున్నాడు. మోతినగర్‌లో అద్దెకుంటున్న వంగా ప్రేమ్‌కుమార్‌(20) మద్యం మత్తులో స్కూటీపై వస్తూ ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టడమే కాకుండా సిమెంటు దిమ్మెతో ప్రకాశ్‌ తలపై బాదాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి చేరిన ప్రకాశ్‌ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అదే రోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌–302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కూతురు (పది రోజులు) ఉంది. 

మరిన్ని వార్తలు