ఖరీదైన ఇళ్లకు గిరాకీ

10 Nov, 2023 00:38 IST|Sakshi

హైదరాబాద్‌ మార్కెట్లో జోరుగా అమ్మకాలు

దేశవ్యాప్తంగా 7 పట్టణాల్లో 97 శాతం అధికం

సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు అధిక డిమాండ్‌ నెలకొంది. రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 97 శాతం పెరిగి 9,200 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 4,700 యూనిట్లుగానే ఉన్నా­యి.

టాప్‌–7 పట్టణాల్లో సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా ‘ఇండియా మార్కెట్‌ మానిటర్‌ క్యూ3, 2023’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ప్రధానంగా ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్‌ విలావంత ఇళ్ల అమ్మకాల్లో టాప్‌–3గా ఉన్నాయి. సెపె్టంబర్‌ క్వార్టర్‌లో మొత్తం విక్రయాల్లో 90 శాతం ఈ మూడు పట్టణాల్లోనే నమోదయ్యాయి.

9,200 యూనిట్ల అమ్మకాల్లో 37 శాతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. ముంబై వాటా 35 శాతం, హైదరాబాద్‌ వాటా 18 శాతం, పుణె వాటా 4 శాతం చొప్పున ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం పెరిగి 2,400 యూనిట్లుగా ఉన్నాయి. జూలై త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ టాప్‌–3 మార్కెట్లుగా ఉండడం, కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య మార్కెట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.

పండుగల జోష్‌
ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు 2021 నుంచి చూస్తే అత్యధికంగా ఉంటాయని సీబీఆర్‌ఈ అంచనా వేసింది. 2021 పండుగ సీజన్‌లో 1,14,500 యూనిట్లు అమ్ముడుపోగా, 2022 పండుగల సీజన్‌లో 1,47,300 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు 1,50,000 యూనిట్లు మైలురాయిని దాటిపోవచ్చని సీబీఆర్‌ఈ అంచనా వేసింది.

ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్‌ మధ్య ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల విభాగాల్లో 2,30,000 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2,20,000 యూనిట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో నూతన ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో ముంబై, పుణె, హైదరాబాద్‌లో మెరుగైన వృద్ధి కనిపించింది. ఈ మూడు పట్టణాలు మొత్తం నూతన ప్రాజెక్టుల ప్రారంభంలో 64 శాతం వాటా కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తలు