తుపాకితో బెదిరించి బ్యాంక్‌ దోపిడీ

1 May, 2022 04:28 IST|Sakshi
బ్యాంకు దోపిడీ అనంతరం తాపీగా నడిచివెళుతున్న అగంతకుడు (సీసీ ఫుటేజి నుంచి సేకరించిన చిత్రం), వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

రూ.3.31 లక్షలు దోచుకున్న అగంతకుడు 

అనకాపల్లి జిల్లా నరసింగబిల్లిలో ఘటన 

కశింకోట: గుర్తు తెలియని ఆగంతకుడు బ్యాంక్‌లోకి ప్రవేశించి.. తుపాకితో బెదిరించి రూ.3.31 లక్షలను దోచుకెళ్లాడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నరసింగబిల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్‌ శాఖలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిని ఆనుకుని జనసమ్మర్దం గల ప్రాంతంలో ఈ దోపీడీ జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భోజన విరామ సమయంలో సుమారు 30 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి ముఖానికి మాస్కు, తలకు హెల్మెట్‌ ధరించి బ్యాంక్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో క్యాషియర్‌ వి.ప్రతాపరెడ్డి ఒక్కరే ఉండగా.. అతడి వద్దకు వెళ్లిన ఆగంతకుడు తుపాకి చూపుతూ బెదిరించాడు.

బ్యాంక్‌ సేఫ్‌ లాకర్‌ తెరవమని గదమాయించాడు. మేనేజర్‌ ఉంటే తప్ప డబుల్‌ లాకర్‌ తెరవలేమని బదులిచ్చిన క్యాషియర్‌ భయంతో లాకర్‌ గదిలోకి వెళ్లి తలుపులు మూసి దాక్కున్నారు. ఆగంతకుడు చేసేది లేక క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ.3.31 లక్షల నగదును తీసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో బ్యాంక్‌ ఇన్‌చార్జి మేనేజర్, మెసెంజర్‌ భోజనానికి వెళ్లారు. ఖాతాదారులెవరూ లేరు. ఇంతలో భోజనానికి వెళ్లిన సిబ్బంది రావడంతో లాకర్‌ గది నుంచి క్యాషియర్‌ బయటకు వచ్చి దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గౌతం సాలి బ్యాంక్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ట్రైనీ ఏఎస్పీ సునిల్‌ సెహవాన్, అనకాపల్లి డీఎస్పీ సునిల్‌ విచారణ చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి వేలిముద్రలు సేకరించింది.  

మరిన్ని వార్తలు