దారుణం: నడిరోడ్డుపైనే ప్రాపర్టీ డీలర్‌ను...

30 Jun, 2021 21:19 IST|Sakshi
సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యం(కర్టెసీ: హెచ్‌టీ)

పట్నా: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. మెటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకున్న దుండగులు నడ్డిరోడ్డుపైనే అతడిని హత్య చేశారు. తుపాకీతో తూటాల వర్షం కురిపించి హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ముజఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని షియోపూర్‌ జిల్లాకు చెందిన ప్రాపర్టీ డీలర్‌ నవాల్‌ కిషోర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. 

వివరాలు.. నవాల్‌ కిషోర్‌ సీతామర్హి- ముజఫర్‌పూర్‌ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డుకున్నారు. అందులో ఓ వ్యక్తి.. వెంటనే తుపాకీ తీసి అతడి వెన్నులో కాల్చారు. తూటా దెబ్బకు అతడు కిందపడిపోగానే.. మరోసారి కాల్పులు జరిపారు. ఆ సమయంలో వారిని చూసి మొరుగుతున్న వీధికుక్క పట్ల కూడా అమానుషంగా వ్యవహరించాడు. దానిని తీవ్రంగా గాయపరచడంతో కొంతదూరం పరిగెత్తుకు వెళ్లి అది మృతిచెందింది. ఇక నవాల్‌ కిషోర్‌ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఈ మేరకు వివరాలు అందించారు. 

కాగా స్థానిక దివంగత రాజకీయవేత్త సూర్యనారాయణ్‌ సింగ్‌ సోదరుడే నవాల్‌ కిషోర్‌ అని ముజఫర్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ జయంత్‌ కాంత్‌ తెలిపారు. ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్‌ రాష్ట్రవాడి తరఫున ఎన్నికల బరిలో నిలవాలని భావించిన సూర్యనారాయణ్‌ సింగ్‌... గతేడాది అక్టోబరులో ప్రచారానికి వెళ్లిన సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో నవాల్‌ కిషోర్‌ హత్యకు కూడా పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు