Bhagwant Mann: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర?.. ఇంటివద్ద బాంబు స్వాధీనం..

2 Jan, 2023 18:16 IST|Sakshi

చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్  బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

చండీగఢ్‌లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు.

ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

చదవండి: 'సమాజం ఎటుపోతుందో ‍అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'

మరిన్ని వార్తలు