Punjab: ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌.. సభలో ప్రసంగిస్తుండగా తీసుకెళ్లిన ఈడీ

6 Nov, 2023 18:54 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్‌ సింగ్‌ గజ్జన్‌ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్‌కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో సోమవారం ఉదయం  ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు.

గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్‌ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్‌ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్‌ సింగ్‌ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. 

అసలేం జరిగిందంటే..
పంజాబ్‌ లూదియానాలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ గతేడాది తారా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీతోపాటు జశ్వంత్‌ సింగ్‌, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్‌.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్‌ సింగ్‌ ఆప్‌లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్‌ అధికార ప్రతినిధి మల్విందర్‌ కాంగ్‌ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్‌ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు.

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్‌ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్‌ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్‌ ఎమ్మెల్యే  కుల్వంత్ సింగ్‌కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది.
చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు