ఈవెంట్‌లా కిడ్నాప్‌: భార్గవ్‌రామ్‌ గెస్ట్‌హౌస్‌కు తరలించి..

18 Jan, 2021 08:01 IST|Sakshi

‘మాదాల సిద్ధార్థ’ ఒక్కడికే రూ.5 లక్షల సుపారీ

అతని గ్యాంగ్‌ సభ్యులకు రూ.25 వేల చొప్పున ఒప్పందం 

రూ.74 వేలు అడ్వాన్స్‌ ఇచ్చిన గుంటూరు శ్రీను.. ‘ఎట్‌ హోమ్‌’లాడ్జ్‌లో వసతి

ఇప్పటికే అఖిలప్రియతో పాటు ముగ్గురి అరెస్టు..

తాజాగా మరో 15 మందికి సంకెళ్లు

నేరానికి ఉపయోగించిన కార్లతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ సీపీ అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో 15 మందిని హైదరాబాద్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటికే టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మల్లికార్జునరెడ్డి, బోయ సంపత్, బాలా చెన్నయ్‌లకు సంకెళ్లు వేయగా.. తాజాగా పట్టుబడిన వారితో ఈ సంఖ్య 19కి చేరింది. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్‌ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. అఖిలప్రియ పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఆ నేరం జరిగిన సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నారు. అచ్చం ఓ ఈవెంట్‌లో ప్లాన్‌ చేసిన ఈ కేసు వివరాలను ఆదివారం బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ మీడియాకు తెలిపారు. 

ముందస్తు వ్యూహం...
కిడ్నాప్‌ ఎలా చేయాలన్న దానిపై అఖిలప్రియ.. భార్గవ్‌రామ్, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, గుంటూరు శ్రీనులతో జనవరి 2న కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్‌లోని నివాసంలో, 4న యూసుఫ్‌గూడలోని ఎంజీహెచ్‌ పాఠశాలలో సమావేశమయ్యారు. గుంటూరు శ్రీను.. సిద్ధార్థను కలసి కిడ్నాప్‌ చేసేందుకు 15 నుంచి 20 మందిని సమకూర్చాలంటూ కోరాడు. దీనికోసం అతనికి రూ.5 లక్షలు, మిగిలిన వారికి రూ.25,000ల చొప్పున ఇస్తామని చెప్పాడు. ముందుగా రూ.74,000లు చెల్లించాడు. ఆ తర్వాత సిద్ధార్థ పంపిన వారందరికి కూకట్‌పల్లి ఫోరమ్‌ మాల్‌కు సమీపంలోని ‘ఎట్‌ హోమ్‌’లాడ్జ్‌లో వసతి కల్పించాడు.

అనంతరం కిడ్నాప్‌ చేసే సమయంలో వీరు అధికారులుగా నటించేందుకు ఫార్మల్‌ డ్రెస్సుల కోసం కొలతలు కూడా తీసుకున్నాడు. మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ల ద్వారా 10 స్టాంప్‌ పేపర్లు.. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి పేరులతో 10 స్టాంప్‌ పేపర్లు ఉండేలా కొన్నాడు. అలాగే ఆరు సెల్‌ఫోన్లు, బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ఓ జిరాక్స్‌ షాప్‌ వద్ద ఓ పేపర్‌పై నకిలీ వాహన నంబర్లు ముద్రించి కిడ్నాప్‌ సమయంలో ఉపయోగించిన కారు నంబర్‌ ప్లేట్‌లపై అతికించారు. (చదవండి: మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్‌’!)

పక్కాగా కిడ్నాప్‌..
జనవరి 5న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంజీహెచ్‌ పాఠశాల వద్ద నిందితులు అందరూ కలిశారు. ఈ కేసులో ఏ2–గా ఉన్న భార్గవ్‌రామ్‌ ఐటీ అధికారులు, పోలీసు ఆఫీసర్లుగా ఎలా వ్యవహరించాలనే దానిపై మిగిలినవారికి వివరించాడు. బోయ సంపత్, బాలా చెన్నై మనోవికాస్‌నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీకు మధ్యాహ్నం సమయంలో వెళ్లి రెక్కీ నిర్వహించారు. బాధితుల కదలికలను ఎప్పటికప్పుడూ చేరవేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఐదు కార్లలో బాధితుల ఇంటికి వెళ్లి ఐటీ, పోలీసులుగా చెబుతూ ఐటీ కార్డులు, సెర్చ్‌ వారంట్‌లు చూపెట్టి సోదాలు చేశారు. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకున్నారు. కూర్చోబెట్టి విచారణ చేశారు.

అనంతరం ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్, సునీల్‌ కుమార్‌ల చేతులు తాళ్లతో కట్టేశారు. కళ్లు కనపడకుండా ఉండేందుకు ముఖాలకు మాస్కులు కట్టారు. ఆ తర్వాత ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. మొయినాబాద్‌లోని భార్గవ్‌రామ్‌ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి ఖాళీ స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కర్రలతో కొడతామంటూ, చంపుతామంటూ బెదిరించి రాసిన పేపర్లపై కూడా సంతకాలు చేయించారు. అయితే బాధితుల గురించి పోలీసులు వెతుకుతున్నారని సమాచారం తెలుసుకున్న వీరు బాధితులను ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని సన్‌సిటీ దగ్గరలో అదే రోజూ రాత్రి వదిలివెళ్లారు. 

వాడిన వాహనాలివే...
భార్గవ్‌రామ్‌ తల్లి కిర్మణ్మయి నాయుడు పేరుతో రిజిష్టర్‌ అయిన ఏపీ21 సీకే 2804 నంబర్‌ ప్లేట్‌ గల ఇన్నోవా కారు. దీనికి టీఎస్‌09 బీజెడ్‌ 9538(నకిలీ నంబర్‌) స్టిక్కర్‌ను అంటించారు. అలాగే ఏపీ21సీఈ 1088 నంబర్‌ ప్లేట్‌ గల స్కార్పియోకు టీఎస్‌09 ఎఫ్‌ఎక్స్‌ 3625 నంబర్‌ను, ఏపీ07 ఈడీ 0875 నంబర్‌ గల స్విఫ్ట్‌ డిజైర్‌కు టీఎస్‌07 యూవీ 2583 నంబర్‌ను వినియోగించారు. అలాగే ఏపీ21 బీకే 3999 నంబర్‌ ప్లేట్‌ గల ఎక్స్‌యూవీ 500 వాహనానికి, వోక్స్‌వ్యాగన్‌ పోలోలకు ఉపయోగించిన నకిలీ నంబర్‌లను ఇంకా కనుక్కోవాల్సి ఉందని డీసీపీ కల్మేశ్వర్‌ తెలిపారు.

ఎవరెవరి పాత్రలు ఏంటంటే..
మాదాల సిద్ధార్థ: ఈవెంట్‌ మేనేజర్‌ అయిన ఇతను కిడ్నాప్‌నకు సహకరించేందుకు 20 మందిని సమకూర్చడంతో పాటు స్విఫ్ట్‌ డిజైర్‌ కారును కూడా వినియోగించాడు. ఏపీ 09 ఈడీ 0875 కారుతో పాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.
బొజ్జగని దేవప్రసాద్‌: కారును డ్రైవ్‌ చేయడంతో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్నాడు.
దేవరకొండ కృష్ణవంశీ, కందుల శివ: పోలీసు డ్రెస్సు ధరించి కానిస్టేబుల్స్‌గా నటించారు.
వీరంతా..: మొగిలి భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, పంచిగలి రాజా, బానోత్‌ సాయిలు, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ నాగార్జున, బొజ్జగాని సాయి, మీసాల శ్రీను, అనీపాక ప్రకాష్, షేక్‌ దావూద్‌ కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు