చిన్నారిని చిదిమేసిందెవరు? 

5 Sep, 2020 10:07 IST|Sakshi
హేమశ్రీ (ఫైల్‌) , సోంపేట సామాజిక ఆసుపత్రి వద్ద రోదిస్తున్న పాపాయి తల్లి, కుటుంబ సభ్యులు 

ఆడించడానికి తీసుకెళ్లిన పక్కింటి మహిళ 

మాయమై వారింటి నీళ్ల ట్యాంకులోనే కనిపించిన పాప 

కొన ఊపిరితో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యం 

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు 

పాలబుగ్గల చిన్నారి.. ముద్దులొలికే పొన్నారి.. బుడిబుడి అడుగులతో ముచ్చట గొలుపుతుంది.. ఊసులాడుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. చందమామలాంటి ఆ పసిపాపను చూస్తే ఎంతటి పాపాత్ముడిలోనైనా పరివర్తన వస్తుంది.. మరి ఆ బుజ్జాయి ప్రాణాలు తీసేందుకు ఎలా మనసొచ్చింది..? ఎంతటి కిరాతక హృదయులో ఇంతటిదారుణానికి ఒడిగట్టారు.. ఆడుకుంటున్న పాపాయి ఊపిరి తీశారు.. అంత ఎత్తున ఉన్న నీళ్ల ట్యాంకులో ఎలా పడిందో.. కాదు కాదు ఎవరు పడదోశారో ప్రశ్నార్థకంగా మిగిలింది.

సాక్షి, సోంపేట(శ్రీకాకుళం జిల్లా): మూల దుర్యోధన, కావ్య దంపతుల ముద్దుల పాపాయి హేమశ్రీ. సోంపేట మండలం టి.శాసనాం గ్రామానికి చెందిన వీరికి పెళ్లయిన రెండేళ్ల తర్వాత పుట్టింది. 11 నెలల ఈ చిన్నారంటే అందరికీ ముద్దే. అందుకే పక్కింట్లో ఉండే వి.నిర్మల ప్రతి రోజు ఈ పాపను వాళ్లింటికి తీసుకెళ్లి కాసేపు ఆడిస్తుంది. శుక్రవారం కూడా అలాగే జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాపను ఆడిస్తానని తీసుకెళ్లిన నిర్మల.. 20 నిమిషాల తరువాత కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. పాప కనిపించడంలేదని చెప్పింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వీధిలో వెదకడం ప్రారంభించారు. అంతలో తమ ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో హేమ పడివుందని నిర్మల తెలిపింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే హేమశ్రీ మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పాప మృతిపై అనుమానాలు 
ఇంటి పైనున్న ట్యాంకు వరకు చిన్నారి వెళ్లలేదు. ఎవరో తీసుకువెళ్లి ఉండాలి. ట్యాంకుకు పైకప్పు ఉంది. కప్పుతీసి నీటిలో పడేసి మూత పెట్టారు. పాపను చంపే ఉద్దేశంతోనే ఎవరో ట్యాంకులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎవరు ఎందుకు చేశారో తల్లిదండ్రులకు అర్థం కావడంలే దు. పాపను ఇంట్లో ఆడిస్తూ పెరట్లోకి వెళ్లానని, అంతలోనే మాయమైందని నిర్మల చెబుతోంది. హేమశ్రీ తండ్రి దుర్యోధన వలస కార్మికుడిగా ముంబైలో పనులు చేస్తున్నారు. ఇచ్ఛాపురం సీఐ వినోద్‌ బాబు, బారువ ఎస్‌ఐ పి.నారాయణస్వామి టి. శాసనాం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారి అంత ఎత్తు ట్యాంకులో ప్రమాదవశాత్తూ పడిపోయే అవకాశం లేదని, అందుకే హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానితులను గుర్తించలేదని, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు