డేటింగ్‌.. చీటింగ్‌! 

21 Nov, 2020 07:56 IST|Sakshi
నిందితులు

సిలిగురి కేంద్రంగా కాల్‌ సెంటర్లు

ఐదుగురు అరెస్ట్‌.. పరారీలో ప్రధాన నిందితుడు

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌

సాక్షి, గచ్చిబౌలి : డేటింగ్‌ అంటూ యాప్‌లో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి చీటింగ్‌కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీపీ వి.సి.సజ్జనార్‌ వెల్లడించారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ డేటింగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేశారు. పేరు, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.  కొద్ది సేపటికే రీమా అనే యువతి ఫోన్‌ చేసి విదేశీయులకు సహాయంగా వెళ్లేందుకు మేల్‌ ఎస్కార్ట్‌ జాబ్‌ ఉందని చెప్పింది. మాటల్లో పెట్టి డేటింగ్‌ కోసం అందమైన అమ్మాయిలను పంపుతామని నమ్మించింది. యువతి మాయమాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి మొదట రూ. 2,500 ఆన్‌లైన్‌లో చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జాయినింగ్‌ ఫీజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, వీఐపీ మెంబర్‌షిప్‌లు, ప్రోడక్ట్‌ పర్చేజ్‌ ఫీజ్, లేట్‌ పీజ్, ఇన్సూ్యరెన్స్, రీఫండ్‌ అమౌంట్‌ పేరిట ఏకంగా రూ. 13,83,643 ఆన్‌లైన్‌లో చెల్లించారు.  చదవండి: ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..

డేటింగ్‌ కోసం మీ ప్రాంతంలో అమ్మాయిలు అందుబాటులో లేరని బుకాయిండంతో తన వెనక్కు ఇవ్వాలని అడిగారు. చెల్లిస్తామని చెప్పి ఫోన్‌ పెట్టేసిన తరువాత ఆ ఫోన్‌ కలవక పోవడంతో మోసాన్ని బాధితుడు సెప్టెంబర్‌ 18న సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్‌ చెందిన మరో వ్యక్తి ఆ వెబ్‌సైట్‌ ఓసెన్‌ చేసి మొబైల్‌ నంబర్, పేరు ఎంటర్‌  చేశారు. త్రిష అనే యువతి మాట్లాడి మొదట ఎస్కార్ట్‌ జాబ్‌ ఇస్తామని, తరువాత మాటల్లో పెట్టి అమ్మాయిలను డేటింగ్‌కు పంపిస్తామని నమ్మబలికింది. రూ. 1,500 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. మెంబర్‌ షిప్, జీఎస్‌టీ అంటూ వివిధ పేర్లు చెప్పి బ్యాంక్‌ అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో రూ. 1,15,700 చెల్లించాడు. మాయ మాటలుగా గుర్తించి అక్టోబర్‌ ఒకటిన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి అమ్మాయిలతో కాల్‌సెంటర్‌..డేటింగ్‌ ముఠా అరెస్ట్‌

రెండు వారాలపాటు రెక్కీ.. ఐదుగురు అరెస్ట్‌ 
పోలీసులు తమ విచారణలో వెస్ట్‌ బెంగాల్‌లోని సిలిగురి కేంద్రంగా కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం సిలిగురి వెళ్లి రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించి ఏబీసీ ఫైనాన్స్‌ బోర్డు పెట్టుకొని కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పర్యవేక్షకులుగా పని చేస్తున్న సిలిగురికి చెందిన బిజయ్‌ కుమార్‌ షా, బినోద్‌ కుమార్‌ షా, మహ్మద్‌నూర్‌ అలమ్‌ అన్సారీ, మేనేజేర్లు దీప హల్దార్‌(27), షికా హల్దార్‌(22)లను స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 11న అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌ టాప్, 31 సెల్‌ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు సంతు దాస్, అమిత్‌ పాల్, శశాంక్‌ కుమార్‌లు పరారీలో ఉన్నారు. 

రోజుకు రూ. కోటి మేర మోసం 
డేటింగ్‌.. చీటింగ్‌ కేసులో నేపాల్‌కు చెందిన సంతుదాస్‌ కింగ్‌ పిన్‌గా వ్యవహరిస్తున్నాడు. నేపాల్‌ నుంచి వచ్చి సిలిగురిలో నివాసం ఉంటున్నాడు. డేటింగ్‌ పేరిట చీటింగ్‌కు పాల్పడే 35 కాల్‌ సెంటర్లు సిలిగురిలో నిర్వహిస్తూ రోజు దాదాపు కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడుతున్నారని కమిషనర్‌ సజ్జనార్‌ పేర్కొన్నారు.  భవనం అద్దెకు తీసుకొని బిజయ్, బినోద్‌ పర్యవేక్షణలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. ఫోన్‌లో మాట్లాడే యువతులకు రోజు చేసే బిజినెస్‌లో 10 శాతం ఇస్తారు. బిజయ్‌ కుమార్‌ అకౌంట్‌లోకి డబ్బు వచ్చిన వెంటనే తమకు రావాల్సిన మొత్తం ఉంచుకొని మిగతా డబ్బును వెంటనే సంతుదాస్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. కస్టమర్లతో మాట్లాడిన సిమ్‌లను తీసి పడేస్తారు. పోలీసులు విచారణ చేస్తున్నారని చిన్నపాటి అనుమానం వచ్చినా కాల్‌ సెంటర్లు మూసివేసి సంతుదాస్‌ నేపాల్‌కు వెళ్లి పరిస్థితులు చక్కబడే వరకు తలదాచుకుంటాడు. ప్రధాన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు. 

డేటింగ్‌ యాప్‌లను ఓపెన్‌ చేయొద్దు..  
డేటింగ్‌ యాప్‌లను ఓపెన్‌ చేయవద్దని, తెలియని వ్యక్తులకు వ్యక్తి గత సమాచారం ఇవ్వొద్దని, ఆన్‌లైన్‌ డబ్బులు చెల్లించవద్దని కమిషనర్‌ సజ్జనార్‌ ప్రజలకు సూచించారు. సైబర్‌ క్రైం బృందాన్ని అభినందించి రివార్డు అందజేశామన్నారు. సమాశంలో క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, ఎస్‌ఐ రాజేంద్ర, ఏఎస్‌ఐ శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు