ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌

5 Oct, 2023 04:19 IST|Sakshi

ఫార్మా కంపెనీలో బాయిలర్‌ ఏర్పాటుకు రూ.5.50 లక్షలు డిమాండ్‌ 

రూ.2.10 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్‌జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో నూతన బాయిలర్‌ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ సత్యనారాయణ అసిస్టెంట్‌ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సెంటారస్‌ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్‌ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్‌ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్‌ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఈ విషయంపై ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ స్నేహి­త మాట్లాడు­తూ బాయిలర్‌ ఫిటింగ్‌ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు