4 నిమిషాల్లో ‘దిశ’ రక్షణ

26 Jul, 2021 04:30 IST|Sakshi

యాప్‌ ఎస్‌వోఎస్‌ సమాచారంతో వేగంగా స్పందించిన పోలీసులు 

నెల్లూరు (క్రైమ్‌): ఆటోడ్రైవర్‌ ప్రవర్తనను అనుమానించి ఆటోలోంచి దూకేసిన యువతిని 4 నిమిషాల్లోనే పోలీసులు ఆదుకున్నారు. దిశ యాప్‌ ఆ యువతికి నిమిషాల్లోనే రక్షణ కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. డీఐజీ త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువతి శ్రీసిటీలో ఉద్యోగం చేస్తూ సూళ్లూరుపేటలో తన సహచరులతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల మార్కాపురం వెళ్లిన ఆమె శనివారం సూళ్లూరుపేటకు బయలుదేరింది. రాత్రి 9.25 గంటలకు నాయుడుపేటలో బస్సు దిగింది.

సూళ్లూరుపేట వెళ్లేందుకు 10.30 గంటల వరకు చూసినా బస్సు లేకపోవడంతో బస్టాండ్‌ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంది. ఒంటరిగా వెళ్లలేక ప్రయాణికులను ఎక్కించుకోమని డ్రైవర్‌కు సూచించింది. బైపాస్‌ వద్ద ఎక్కించుకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్‌ ఎవరినీ ఎక్కించుకోకుండా వేగంగా వెళ్లసాగాడు. అతడి ప్రవర్తనను అనుమానించిన ఆమె బస్‌స్టాప్‌ వద్ద ఆపమని కోరినా అతడు పట్టించుకోకుండా వెళ్లసాగాడు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని ఫోన్‌లో తన సోదరికి తెలిపి, నెల్లబల్లి వద్ద ఆటోలోంచి దూకేసింది. బాధిత యువతి సోదరి తన స్నేహితురాలి మొబైల్‌లోని దిశ యాప్‌ను ఓపెన్‌ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

బాధిత యువతి ఫోన్‌ నంబరు తెలిపింది. నెల్లూరు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నుంచి 10.38 గంటలకు సమాచారం అందుకున్న హైవే మొబైల్‌ పోలీసులు 10.40 గంటలకు బాధిత యువతితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారిసత్రం పోలీసులు, హైవే మొబైల్‌ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా సూళ్లూరుపేటలోని ఆమె సోదరి వద్దకు తీసుకెళ్లారు. నిమిషాల్లోనే యువతిని రక్షించిన పోలీసు సిబ్బందిని, అధికారుల్ని డీఐజీ, ఎస్పీ అభినందించారు. బాధిత యువతి, ఆమె సోదరి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్‌ తమను రక్షించిందని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు