లాక్‌డౌన్‌ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! 

30 May, 2021 05:00 IST|Sakshi

‘డయల్‌ 100’కు పెరుగుతున్న కాల్స్‌ 

లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్, బాల్య వివాహాలపైనా ఫిర్యాదులు 

నట్టింట్లో మద్యం.. జగడాలకు బీజం 

లాక్‌డౌన్‌ వేళ పెరిగిన గృహహింస 

రెండు వారాల్లోనే 7 వేలు దాటిన ఫిర్యాదులు 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ.. ఇంటింటా హింస మహిళలు భరించలేనంత! వేధింపులు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కొన్ని సత్ఫలితాలు ఇస్తుండగా, గృహిణులకు మాత్రం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉంటున్నారు. చిన్న తరహా వ్యాపారాలు మూతబడ్డాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా వీరిని చుట్టుముట్టాయి. దీంతో కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానగా మారి పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. ఫలితంగా బాధితులు ‘డయల్‌ 100’ను ఆశ్రయిస్తున్నారు. మహిళలపై మందుబాబుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. 

13 రోజుల్లో 7,679 ఫిర్యాదులు 
మహిళలు, చిన్నారులపై వేధింపులకు సంబంధించి ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ‘డయల్‌ 100’కు 7,679 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో గృహిణులపై వేధింపులు, బాల్యవివాహాలు, బ్లాక్‌ మెయిలింగ్, వరకట్నం వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ తదితరాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటి నుంచి మొత్తం 7,679 కాల్స్‌లో 4,395 ఫిర్యాదులు గృహహింసకు సంబంధించినవే కావడం గమనార్హం. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇంట్లోనే పెళ్లాంపిల్లలతో సంతోషంగా గడిపారు.

కానీ, ఈసారి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అత్యవసరాల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అదే సమయంలో మద్యం కూడా దొరుకుతుండటం, అలా తెచ్చుకున్న మద్యాన్ని ఇంట్లోనే తాగడం, నిషాలో పాత విషయాలన్నీ బయటికి తీసి లొల్లులకు దిగడం గృహహింసకు దారి తీస్తోంది. కొందరు మహిళలు మౌనంగా భరిస్తుండగా, మరికొందరు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  

2,752 వేధింపులు, 75 బాల్యవివాహాలు 
లాక్‌డౌన్‌  సమయంలో ఇంటి వద్ద ఉంటున్న మహిళలు, యువతులపై వక్రబుద్ధి గల పురుషుల వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. వీటిపై ‘డయల్‌ 100’కు 2,752 ఫిర్యాదులు వచ్చాయి. కొందరు ప్రబుద్ధులు 44 మందిపై లైంగిక దాడికి యత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో, నేరుగా తమను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని 98 మంది యువతులు ఫిర్యాదులు చేశారు. ఇక వరకట్నం వేధింపులు 37, ఈవ్‌ టీజింగ్‌ 50, ఇతరత్రా మరో 222 ఫిర్యాదులు వచ్చాయి. ఆర్థిక స్థితి బాగాలేని కొన్ని కుటుంబాల్లో బాల్యవివాహాలు చేస్తున్నారు. వీటిపై 75 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తానికి క్రితంసారి లాక్‌డౌన్‌ కంటే ఈసారి ఆడవారిపట్ల వేధింపులు అధికమయ్యాయని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు