దేవికారాణి నగలపై ఈడీ ఆరా!

18 Sep, 2020 09:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

గురువారం ఈడీ తన దర్యాప్తులో భాగంగా దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. దేవికారాణి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రూ.7 కోట్లకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. సదరు నగల షాపు యజమానుల వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అయితే తమ బంధువుల డబ్బుతో ఈ బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.  (దేవికారాణి ‘రియల్‌’ దందా!)

ముడుపుల మళ్లింపు..!
ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులంతా ఎక్కువగా భూములే కొన్నారు. వీరిలో దేవికారాణి మాత్రం భూములతో పాటు నగలపైనా దృష్టి సారించారు. అందుకే తనకు ముడుపులుగా అందిన నగదును నగరంలోని ప్రముఖæ నగల షాపులో అభరణాలు కొనేందుకు మళ్లించినట్లు గుర్తించారు.  (ఈఎస్‌ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్‌)

చాలా సందర్భాల్లో ఆమెకు అందాల్సిన ముడుపులను తాను తీసుకోకుండా తన మనుషుల ద్వారా జ్యువెలరీస్‌కు మళ్లించి నగలకు ఆర్డర్‌ ఇచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు రూ.7 కోట్ల డబ్బును దేవికారాణి నగల కోసం చెల్లించింది. పూర్తి మొత్తం చెక్కులు, ఆన్‌లైన్‌ కంటే అధికంగా నగదు రూపంలో వచ్చినప్పటికీ.. నగల షాపు యాజమాన్యం కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

మరిన్ని వార్తలు