డ్రగ్స్‌పై ఈడీ అమీతుమీ! 

7 Feb, 2022 04:48 IST|Sakshi

మళ్లీ తెరపైకి 2017 నాటి డ్రగ్స్‌ కేసు.. తిరగదోడనున్న ఈడీ 

విచారణ వివరాలకు, చార్జిషీట్లకు పొంతనలేని వైనం 

ఎక్సైజ్‌ అధికారులనూ విచారించే యోచన 

టోనీ వ్యవహారంపైనా ఆరా 

మనీలారిండరింగ్‌పై వ్యాపారవేత్తలకు బిగుస్తున్న ఉచ్చు 

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అమీతుమీ తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సంసిద్ధమైంది. పాత కేసుల్లో స్పష్టత రానందున వాటిని మళ్లీ తిరగతోడే పనిలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో 2017లో జరిగిన సినీ ప్రముఖుల డ్రగ్స్‌ వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి విచారణకు సిద్ధమవుతుండటం సంచలనం రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఎక్సైజ్‌ శాఖను ఆదేశించడంతో కేసు దర్యాప్తు హీటెక్కినట్టు తెలుస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసులు విచారిస్తున్న డ్రగ్స్‌ పెడ్లర్‌ (అక్రమ సరఫరాదారు) టోనీ వ్యవహారంపైనా ఈడీ దృష్టిపెట్టింది. విదేశాలకు నిధుల తరలింపుతోపాటు రూ. కోట్లు బదిలీ చేసి వ్యాపారవేత్తలు డ్రగ్స్‌ దందాలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తోంది.  

పొంతన లేని విచారణ 
2017లో డ్రగ్స్‌ వాడారన్న కేసులో మనీలాండరింగ్‌ జరిగిందని భావించిన ఈడీ 13 మంది సినీ ప్రముఖులను విచారించింది. అయితే ఈ విచారణలో ఎక్సైజ్‌ శాఖ నుంచి ఎలాంటి సహకారం అందలేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. అప్పుడు విచారణ సమయంలోనూ ఈడీ అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. కేసు విచారణలో బయటకొచ్చిన అంశాలకు, దాఖలు చేసిన చార్జిషీట్లకు పొంతనలేదన్న భావనలో ఈడీ అధికారులున్నట్టు సమాచారం.

తాజా పరిణామాల నేపథ్యంలో అప్పటి కాల్‌డేటా, నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో విచారించాలని భావిస్తోంది. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను విచారించాలని యోచిస్తోంది. విచారణ సమయంలో తమకు సహకరించలేదని, మనీలాండరింగ్‌ అంశాలు బయటకు రాకుండా వ్యవహరించారని అనుమానిస్తోంది. వీరిని విచారిస్తే రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ  ఈడీ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారనుంది.  

వ్యాపారవేత్తలకు నోటీసులు! 
హైదరాబాద్‌ డ్రగ్‌ కేసులో టోనీ, ప్రముఖ వ్యాపారవేత్తల వ్యవహారంపైనా ఈడీ చర్యలు చేపట్టింది.  వ్యాపారవేత్తల ద్వారా సమకూరిన డబ్బును నైజీరియాకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు  పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఈ కేసులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ జరపాలని భావిస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ 31 మంది వ్యాపారవేత్తల నుంచి హవాలా రూపంలో డ్రగ్స్‌ కొనుగోలు జరిగిందా అన్న కోణంలోనూ విచారించాలని యోచిస్తోంది.  వ్యాపారవేత్తలకు నోటీసులు జారీచేసి విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.    

మరిన్ని వార్తలు