నా జీవితాన్ని విడిచిపెడుతున్నాను.. సారీ మమ్మీడాడీ

11 Apr, 2022 08:15 IST|Sakshi

మేడ్చల్‌రూరల్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కండ్లకోయలోని  సీఎంఆర్‌ఐటీ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్‌కు చెందిన  సాత్విక గౌడ్‌(19)   సీఎంఆర్‌ఐటీలో బీటెక్‌ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. శనివారం రాత్రి  డిన్నర్‌కు పిలిచేందుకు స్నేహితురాలు సాత్విక గదికి వెళ్లగా అప్పటికే ఆమె ఏడుస్తూ కూర్చుంది.

దీనిపై స్నేహితురాలు  ప్రశ్నించగా మిడ్‌ ఎగ్జామ్స్‌ ఉన్నా.. ఏమీ చదవలేదని చెప్పింది. అంతేగాక మమ్మీ కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తెలిపింది. తాను తర్వాత తింటానని చెప్పడంతో మీ రూమ్‌మెట్స్‌ లేరు కదా ఒంటరిగా పడుకోవద్దని తన గదికి రావాలని చెప్పి స్నేహితురాలు వెళ్లిపోయింది.

ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె  కని పించకపోవడంతో స్నేహితులు  ఆమె కోసం గాలించారు. బాత్‌రూమ్‌ డోర్‌ తలుపులు కొట్టగా ఎంతకీ తెరుచుకోవపోవడంతో  హాస్టల్‌ వార్డెన్‌కు సమాచా రం అందించారు. వార్డెన్‌ సిబ్బంది సాయంతో బాత్‌రూం తలుపులు పగులగొట్టి చూడగా సాత్విక సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో మేడ్చల్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

సూసైడ్‌ నోట్‌లో తల్లిదండ్రులకు సారీ చెప్పి..
సాత్విక సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు తెలిపారు. ‘నా జీవితాన్ని విడిచిపెడుతున్నాను.. సారీ మమ్మీడాడీ’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసింది.  గతంలోనూ  తాను సరిగ్గా చదవలేకపోతున్నానని కిటికీలోంచి దూకి చావాలనిపిస్తుందని చెప్పేదని,  చదువులో ఇబ్బంది కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిపారు.

ఈ నెల 15న తన బంధువుల శుభకార్యం ఉండగా పరీక్షలు రాసి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం కాలేజీ వద్దకు వచ్చిన సాత్విక తల్లిదండ్రులు  తాము రాకముందే మృతదేహాన్ని ఎలా మార్చురీకి తరలిస్తారని  కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్‌ దహనం)

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు